Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 23, 2013

ప్రసంగి1

Ecc 1:1  దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై యుండిన ప్రసంగి పలికిన మాటలు. 
Ecc 1:2  వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. 
Ecc 1:3  సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి? 
Ecc 1:4  తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది. 
Ecc 1:5  సూర్యుడుద యించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. 
Ecc 1:6  గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును. 
Ecc 1:7  నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును 
Ecc 1:8  ఎడతెరిపి లేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు. 
Ecc 1:9  మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది; మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు. 
Ecc 1:10  ఇది నూతనమైనదని యొకదానిగూర్చి యొకడు చెప్పును; అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. 
Ecc 1:11  పూర్వులు జ్ఞాపక మునకు రారు; పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండ బోవువారికి కలుగదు. 
Ecc 1:12  ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీ యులమీద రాజునై యుంటిని. 
Ecc 1:13  ఆకాశముక్రింద జరుగు నది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలె నని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది. 
Ecc 1:14  సూర్యునిక్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి. 
Ecc 1:15  వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు, లోపముగలది లెక్కకు రాదు. 
Ecc 1:16  యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాల ఎక్కువగా జ్ఞానము సంపాదించితి ననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితి ననియు నా మనస్సులో నేననుకొంటిని. 
Ecc 1:17  నా మనస్సు నిలిపి, జ్ఞానాభ్యాసమును వెఱ్ఱితనమును మతిహీనతను తెలిసికొనుటకు ప్రయత్నించితిని; అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలిసికొంటిని. 
Ecc 1:18  విస్తార మైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును; అధిక విద్య సంపాదించినవానికి అధిక శోకము కలుగును. 

ప్రసంగి2

Ecc 2:1  కానీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయ ముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్న మాయెను. 
Ecc 2:2  నవ్వుతోనీవు వెఱ్ఱిదానవనియు, సంతోష ముతోనీచేత కలుగునదేమియనియు నేవంటిని. 
Ecc 2:3  నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రదుకుకాలమంతయు మనుష్యులు ఏమిచేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసముచేత సంతోషపరచుకొందుననియు, మతి హీనతయొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసికొంటిని. 
Ecc 2:4  నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని. 
Ecc 2:5  నాకొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని. 
Ecc 2:6  వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని. 
Ecc 2:7  పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేము నందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱ మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని. 
Ecc 2:8  నాకొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆ యా దేశ ములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయ కులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచు కొంటిని. 
Ecc 2:9  నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని; నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు. 
Ecc 2:10  నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము. 
Ecc 2:11  అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. 
Ecc 2:12  రాజు తరువాత రాబోవు వాడు, ఇదివరకు జరిగిన దాని విషయము సయితము ఏమి చేయునో అనుకొని, నేను జ్ఞానమును వెఱ్ఱితనమును మతిహీనతను పరిశీలించు టకై పూనుకొంటిని. 
Ecc 2:13  అంతట చీకటికంటె వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనతకంటె జ్ఞానము అంత ప్రయో జనకరమని నేను తెలిసికొంటిని. 
Ecc 2:14  జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు; అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని. 
Ecc 2:15  కావున బుద్ధి హీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని. ఇదియు వ్యర్థమే. 
Ecc 2:16  బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని యుంచబడదు; రాబోవు దిన ములలో వారందరును మరువబడినవారై యుందురు; జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిదే. 
Ecc 2:17  ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను అంతయు వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నా కసహ్యమాయెను. 
Ecc 2:18  సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని. 
Ecc 2:19  వాడు జ్ఞానము గలవాడై యుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవ నికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాస పడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే. 
Ecc 2:20  కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస మంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. 
Ecc 2:21  ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయ వలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది. 
Ecc 2:22  సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటి చేతను, వాడు తలపెట్టు కార్యము లన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది? 
Ecc 2:23  వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియం దైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు; ఇదియువ్యర్థమే. 
Ecc 2:24  అన్నపానములు పుచ్చుకొనుటకంటెను, తన కష్టార్జి తముచేత సుఖపడుటకంటెను నరునికి మేలుకర మైనదేదియు లేదు. ఇదియును దేవునివలన కలుగునని నేను తెలిసి కొంటిని. 
Ecc 2:25  ఆయన సెలవులేక భోజనముచేసి సంతో షించుట ఎవరికి సాధ్యము? 
Ecc 2:26  ఏలయనగా దైవదృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును; అయితే దైవదృష్టికి ఇష్టు డగువాని కిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థము గాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. 

ప్రసంగి3

Ecc 3:1  ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. 
Ecc 3:2  పుట్టుటకు, చచ్చుటకు; నాటుటకు నాటబడినదాని పెరికివేయుటకు, 
Ecc 3:3  చంపుటకు బాగుచేయుటకు; పడగొట్టుటకు కట్టుటకు; 
Ecc 3:4  ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు; 
Ecc 3:5  రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు; కౌగ లించుటకు కౌగలించుట మానుటకు; 
Ecc 3:6  వెదకుటకు పోగొట్టు కొనుటకు, దాచు కొనుటకు పారవేయుటకు; 
Ecc 3:7  చింపుటకు కుట్టుటకు; మౌనముగా నుండుటకు మాటలాడుటకు; 
Ecc 3:8  ప్రేమించుటకు ద్వేషించుటకు; యుద్ధము చేయుటకు సమాధానపడుటకు. 
Ecc 3:9  కష్టపడినవారికి తమ కష్టమువలన వచ్చిన లాభమేమి? 
Ecc 3:10  నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచి తిని. 
Ecc 3:11  దేనికాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించియున్నాడు; ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడుగాని దేవుడు చేయుక్రియలను పరిశీలనగా తెలిసికొనుటకు అది చాలదు. 
Ecc 3:12  కావున సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుట కంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసి కొంటిని. 
Ecc 3:13  మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చు కొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవు డిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని. 
Ecc 3:14  దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని; దాని కేదియు చేర్చబడదు దానినుండి ఏదియు తీయబడదు; మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు. 
Ecc 3:15  ముందు జరిగినదే ఇప్పుడును జరుగును; జరుగబోవునది పూర్వమందు జరిగి నదే; జరిగిపోయినదానిని దేవుడు మరల రప్పించును. 
Ecc 3:16  మరియు లోకమునందు విమర్శస్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. 
Ecc 3:17  ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయ మున్నదనియు, నీతిమంతుల కును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేననుకొంటిని. 
Ecc 3:18  కాగా తాము మృగములవంటివారని నరులు తెలిసికొనునట్లును, దేవుడు వారిని విమర్శించునట్లును ఈలాగు జరుగుచున్నదని అను కొంటిని. 
Ecc 3:19  నరులకు సంభవించునది యేదో అదే, మృగ ములకు సంభవించును; వారికిని వాటికిని కలుగు గతి ఒక్కటే; నరులు చచ్చునట్లు మృగములును చచ్చును; సకల జీవులకు ఒక్కటే ప్రాణము; మృగములకంటె నరుల కేమియు ఎక్కువలేదు; సమస్తమును వ్యర్థము. 
Ecc 3:20  సమస్తము ఒక్క స్థలమునకే పోవును; సమస్తము మంటిలోనుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. 
Ecc 3:21  నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును? 
Ecc 3:22  కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి లేపికొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలయందు సంతోషించుటకంటె వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలిసికొంటిని; ఇదే వారి భాగము. 

ప్రసంగి4

Ecc 4:1  పిమ్మట సూర్యునిక్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు; వారిని బాధపెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడెవడును లేకపోయెను. 
Ecc 4:2  కాబట్టి యింకను బ్రదుకుచున్నవారి కంటె ఇంతకుముందు కాలము చేసినవారే ధన్యులను కొంటిని. 
Ecc 4:3  ఇంకను పుట్టని వారు సూర్యునిక్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువుచేత ఈ ఉభయులకంటెను వారే ధన్యులనుకొంటిని. 
Ecc 4:4  మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన పను లన్నియు నరులకు రోషకారణములని నాకు కనబడెను; ఇదియు వ్యర్థముగా నొకడు గాలిని పట్టుకొనుటకై చేయు ప్రయత్నమువలెనున్నది. 
Ecc 4:5  బుద్ధిహీనుడు చేతులు ముడుచు కొని తన మాంసము భక్షించును. 
Ecc 4:6  శ్రమయును గాలి కైన యత్నములును రెండు చేతులనిండ నుండుటకంటె ఒక చేతినిండ నెమ్మదికలిగి యుండుట మేలు. 
Ecc 4:7  నేనాలోచింపగా వ్యర్థమైనది మరియొకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. 
Ecc 4:8  ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు; అయినను అతడు ఎడతెగక కష్టపడును; అతని కన్ను ఐశ్వర్యముచేత తృప్తిపొందదు, అతడుసుఖమనునది నేనెరుగక ఎవరినిమిత్తము కష్టపడుచున్నానని అను కొనడు; ఇదియు వ్యర్థమైనదై బహు చింత కలిగించును. 
Ecc 4:9  ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలముకలుగును గనుక ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు. 
Ecc 4:10  వారు పడిపోయినను ఒకడు తనతోడివానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయినయెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును. 
Ecc 4:11  ఇద్దరు కలిసి పండుకొనినయెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? 
Ecc 4:12  ఒంటరి యగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా? 
Ecc 4:13  మూఢత్వముచేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజుకంటె బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్న వాడే శ్రేష్ఠుడు. 
Ecc 4:14  అట్టివాడు తన దేశమందు బీదవాడుగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలోనుండి బయలువెళ్లును. 
Ecc 4:15  సూర్యునిక్రింద సంచరించు సజీవు లందరు గతించిన రాజునకు బదులుగా రాజైన ఆ చిన్న వాని పక్షమున నుందురని నేను తెలిసికొంటిని. 
Ecc 4:16  అతని ఆధిపత్యము క్రింది జనులకు లెక్కయే లేదు, అయినను తరువాత రాబోవువారు వీనియందు ఇష్టపడరు. నిజముగా ఇదియు వ్యర్థమే, ఒకడు గాలికై ప్రయాసపడినట్టే. 

ప్రసంగి5

Ecc 5:1  నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; బుద్ధిహీనులు అర్పించు నట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము; వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయు దురు. 
Ecc 5:2  నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచు కొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. 
Ecc 5:3  విస్తారమైన పనిపాటులవలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. 
Ecc 5:4  నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము;బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు. 
Ecc 5:5  నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొన కుండుటయే మేలు. 
Ecc 5:6  నీ దేహమును శిక్షకు లోపరచు నంత పని నీ నోటివలన జరుగనియ్యకుము; అది పొర పాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు? 
Ecc 5:7  అధికమైన స్వప్నములును మాట లును నిష్‌ప్రయోజనములు; నీమట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము. 
Ecc 5:8  ఒక రాజ్యమందు బీదలను బాధించుటయు, ధర్మమును న్యాయమును బలాత్కారముచేత మీరుటయు నీకు కన బడినయెడల దానికి ఆశ్చర్యపడకుము; అధికారము నొందినవారిమీద మరి ఎక్కువ అధికారము నొందినవా రున్నారు; మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా నున్నాడు. 
Ecc 5:9  ఏ దేశములో రాజు భూమివిషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వవిషయములయందు మేలు కలుగును. 
Ecc 5:10  ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తి నొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు; ఇదియు వ్యర్థమే. 
Ecc 5:11  ఆస్తి యెక్కువైన యెడల దాని భక్షించువారును ఎక్కువ అగుదురు; కన్నులార చూచుటయేగాక ఆస్తిపరునికి తన ఆస్తివలని ప్రయోజన మేమి? 
Ecc 5:12  కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు; అయితే ఐశ్వర్యవంతులకు తమ ధనసమృధ్థిచేత నిద్రపట్టదు. 
Ecc 5:13  సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించు కొనును. 
Ecc 5:14  అయితే ఆ ఆస్తి దురదృష్టమువలన నశించి పోవును; అతడు పుత్రులుగలవాడైనను అతనిచేతిలో ఏమియు లేకపోవును. 
Ecc 5:15  వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భమునుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చి నట్లే దిగంబరిగానే మరల పోవును, తాను ప్రయాస పడి చేసికొనినదానిలో ఏదైనను చేతపట్టుకొనిపోడు; 
Ecc 5:16  అతడు వచ్చిన ప్రకారముగానే మరల పోవును; గాలికి ప్రయాసపడి సంపాదించినదానివలన వానికి లాభమేమి? 
Ecc 5:17  ఇదియు మనస్సునకు ఆయాసకరమైనదే, తన దినము లన్నియు అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును, రోగమును, అసహ్యమును కలుగును. 
Ecc 5:18  మరియు కోరదగినదిగాను చూడ ముచ్చటయైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటివలన క్షేమముగా బ్రదుకుచుండుటయే, ఇదియే వానికి భాగ్యము. 
Ecc 5:19  మరియు దేవుడు ఒకనికి ధనధాన్యసమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసినయెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదమువలన కలిగినదను కొనవలెను. 
Ecc 5:20  అట్టివానికి దేవుడు హృదయానందము దయచేసియున్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసికొనడు. 

ప్రసంగి6

Ecc 6:1  సూర్యుని క్రింద దురవస్థ యొకటి నాకు కనబడెను, అది మనుష్యులకు బహు విశేషముగా కలుగుచున్నది 
Ecc 6:2  ఏమనగా, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును. అతడేమేమి కోరినను అది అతనికి తక్కువకాకుండును; అయినను దాని ననుభవించుటకు దేవుడు వానికి శక్తి ననుగ్రహింపడు, అన్యుడు దాని ననుభవించును; ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది. 
Ecc 6:3  ఒకడు నూరుమంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, అతడు సుఖాను భవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండినయెడల వాని గతికంటె పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేననుకొనుచున్నాను 
Ecc 6:4  అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును, దాని పేరు చీకటిచేత కమ్మబడెను. 
Ecc 6:5  అది సూర్యుని చూచినది కాదు, ఏ సంగతియు దానికి తెలియదు, అతని గతికంటె దాని గతి నెమ్మదిగలది. 
Ecc 6:6  అట్టివాడు రెండువేల సంవత్సరములు బ్రదికియు మేలు కానకయున్న యెడల వానిగతి అంతే; అందరును ఒక స్థలమునకే వెళ్లుదురు గదా. 
Ecc 6:7  మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా; అయినను వారి మనస్సు సంతుష్టినొందదు. 
Ecc 6:8  బుద్ధిహీనులకంటె జ్ఞానుల విశేషమేమి? సజీవులయెదుట బ్రదుకనేర్చిన బీదవారికి కలిగిన విశేషమేమి? 
Ecc 6:9  మనస్సు అడియాశలు కలిగి తిరుగు లాడుటకన్న ఎదుట నున్నదానిని అనుభవించుట మేలు; ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే. 
Ecc 6:10  ముందుండినది బహుకాలముక్రిందనే తెలియబడెను; ఆయా మనుష్యులు ఎట్టివారగుదురో అది నిర్ణయ మాయెను; తమకంటె బలవంతుడైనవానితో వారు వ్యాజ్యెమాడజాలరు. 
Ecc 6:11  పలుకబడిన మాటలలో నిరర్థకమైన మాటలు చాల ఉండును; వాటివలన నరులకేమి లాభము? 
Ecc 6:12  నీడవలె తమ దినములన్నియు వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రదుకునందు ఏది వారికి క్షేమకరమైనదొ యవరికి తెలియును? వారు పోయిన తరువాత ఏమి సంభ వించునో వారితో ఎవరు చెప్పగలరు? 

ప్రసంగి7

Ecc 7:1  సుగంధతైలముకంటె మంచి పేరు మేలు; ఒకని జన్మ దినముకంటె మరణదినమే మేలు. 
Ecc 7:2  విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు. 
Ecc 7:3  నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. 
Ecc 7:4  జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధి హీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును. 
Ecc 7:5  బుద్ధిహీనుల పాటలు వినుటకంటె జ్ఞానుల గద్దింపు వినుట మేలు. 
Ecc 7:6  ఏలయనగా బానక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే; ఇదియు వ్యర్థము. 
Ecc 7:7  అన్యాయము చేయుటవలన జ్ఞానులు తమ బుద్ధిని కోలుపోవుదురు; లంచము పుచ్చుకొనుటచేత మనస్సు చెడును. 
Ecc 7:8  కార్యారంభముకంటె కార్యాంతము మేలు; అహంకారము గలవానికంటె శాంతముగలవాడు శ్రేష్ఠుడు 
Ecc 7:9  ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. 
Ecc 7:10  ఈ దినములకంటె మునుపటి దినములు ఏల క్షేమకరములు అని యడుగవద్దు; ఈ ప్రశ్నవేయుట జ్ఞానయుక్తము కాదు 
Ecc 7:11  జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; సూర్యుని క్రింద బ్రదుకువారికి అది లాభకరము. 
Ecc 7:12  జ్ఞానము ఆశ్ర యాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము. 
Ecc 7:13  దేవుని క్రియలను ధ్యానించుము; ఆయన వంకరగా చేసినదానిని ఎవడు చక్కపరచును? 
Ecc 7:14  సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు. 
Ecc 7:15  నా వ్యర్థసంచారముల కాలములో నేను వీటినన్నిటిని చూచితిని; నీతి ననుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై యుండియు చిరాయువులైన దుష్టులును కలరు. 
Ecc 7:16  అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధిక ముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసి కొందువు? 
Ecc 7:17  అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు;నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు? 
Ecc 7:18  నీవు దీని పట్టుకొనియుండుటయు దానిని చేయివిడువకుండుటయు మేలు; దేవునియందు భయభక్తులు గలవాడు వాటినన్నిటిని కొనసాగించును. 
Ecc 7:19  పట్టణమందుండు పదిమంది అధికారులకంటె జ్ఞానము గలవానికి జ్ఞానమే యెక్కువైన ఆధారము. 
Ecc 7:20  పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు. 
Ecc 7:21  నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము. 
Ecc 7:22  నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి యున్నది గదా. 
Ecc 7:23  ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను. 
Ecc 7:24  సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు 
Ecc 7:25  వివేచించుటకును పరిశోధించుటకును, జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతులయొక్క హేతువులను తెలిసికొనుట కును, భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెఱ్ఱితన మనియు గ్రహించుటకును, రూఢి చేసికొని నా మనస్సు నిలిపితిని. 
Ecc 7:26  మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ; దేవుని దృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు. 
Ecc 7:27  సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పు చున్నాను; అయితే నేను తరచి చూచినను నాకు కనబడ నిది ఒకటి యున్నది. 
Ecc 7:28  అదేదనగా వెయ్యిమంది పురుషు లలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు. 
Ecc 7:29  ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.