Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Monday, September 23, 2013

ప్రసంగి1

Ecc 1:1  దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై యుండిన ప్రసంగి పలికిన మాటలు. 
Ecc 1:2  వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. 
Ecc 1:3  సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి? 
Ecc 1:4  తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది. 
Ecc 1:5  సూర్యుడుద యించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. 
Ecc 1:6  గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును. 
Ecc 1:7  నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును 
Ecc 1:8  ఎడతెరిపి లేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు. 
Ecc 1:9  మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది; మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు. 
Ecc 1:10  ఇది నూతనమైనదని యొకదానిగూర్చి యొకడు చెప్పును; అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. 
Ecc 1:11  పూర్వులు జ్ఞాపక మునకు రారు; పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండ బోవువారికి కలుగదు. 
Ecc 1:12  ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీ యులమీద రాజునై యుంటిని. 
Ecc 1:13  ఆకాశముక్రింద జరుగు నది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసము నొందవలె నని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది. 
Ecc 1:14  సూర్యునిక్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి. 
Ecc 1:15  వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు, లోపముగలది లెక్కకు రాదు. 
Ecc 1:16  యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాల ఎక్కువగా జ్ఞానము సంపాదించితి ననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితి ననియు నా మనస్సులో నేననుకొంటిని. 
Ecc 1:17  నా మనస్సు నిలిపి, జ్ఞానాభ్యాసమును వెఱ్ఱితనమును మతిహీనతను తెలిసికొనుటకు ప్రయత్నించితిని; అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలిసికొంటిని. 
Ecc 1:18  విస్తార మైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును; అధిక విద్య సంపాదించినవానికి అధిక శోకము కలుగును. 

No comments:

Post a Comment